వైసీపీ ఎమ్మెల్యేకు అండగా నిలిచిన కుమార్తెలు.. పేదల కోసం!

కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు. లాక్‌డౌన్ వేళ ఇబ్బందిపడుతున్న ప్రజల కోసం సాయం అందిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు.. ఇలా తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రం వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. పేదలకు బియ్యం అందించాలనే సంకల్పంతో నియోజకవర్గంలో పండిన ధాన్యాన్ని అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే పిలుపుతో చాలామంది రైతులు ముందుకు వచ్చారు.. ధాన్యాన్ని అప్పగిస్తున్నారు.ఇటు ఎమ్మెల్యే కాకాణికి కుమార్తెలు కూడా అండగా నిలిచారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే కుమార్తెలు పూజిత, సుచిత్ర.. అల్లుళ్లు అశ్వంత్‌కృష్ణారెడ్డి, గోపాలకృష్ణారెడ్డిలు శుక్రవారం రూ.1.80 లక్షల విలువైన 12 పుట్ల ధాన్యాన్ని అందజేశారు. తమ తండ్రి పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి అండగా నిలవాలనే లక్ష్యంతోనే తమ వంతు ధాన్యాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు.

లాక్‌‌డౌన్, కరోనా వంటి కష్టకాలంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు.. సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.