కథ కోసం రూ.50 లక్షలు వెచ్చించిన నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. కిందటేడాది రెండు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ఈ ఏడాది మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు.సహజ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని మొదటి నుంచీ వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘అష్టాచమ్మా’ సినిమాతో నటుడిగా మొదలైన నాని ప్రయాణం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగుతోంది. అయితే, కిందటేడాది నాని నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించలేకపోయాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. కాసుల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ నాని జోష్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.క్రియేటివ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ‘V’ సినిమాను నాని చేస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తు్న్నారు. నిజానికి ఈ సినిమాలో నానిది నెగిటివ్ రోల్. చాలా క్రూరంగా కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో పాటు ‘టక్ జగదీశ్’ అనే సినిమాను కూడా నాని మొదలుపెట్టారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇక నాని హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ మధ్యనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియోతో టైటిల్‌ను ప్రకటించారు. ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.